వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి : సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు రావాలంటే క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ‘మై భారత్ డిప్యూటీ డైరక్టర్ గొర్లి మహేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జార్జి క్లబ్‌లో దివంగత శ్రీమతి శరకడం మహాలక్ష్మి గారి జయంతిని పురస్కరించుకుని రెండు రోజులు జరిగిన షటిల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, జిమ్ ఆదివారం రాత్రి ముగిశాయి. అనంతరం జరిగిన క్రీడా పోటీల విజేతల బహుమతిప్రధానోత్సవ సభకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న మహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ‘మై భారత’ పోర్టల్ ద్వారా యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి చేస్తోందని వివరించారు. క్రీడా స్ఫూర్తి అనేది కేవలం ఆటలకే పరిమితం కాకుండా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తోడ్పడుతుందని చెప్పారు. జిమ్ వంటి విభాగాల్లో యువత చూపుతున్న ఆసక్తి వారి శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందని గుర్తు చేశారు. క్రమశిక్షణ, అంకితభావం అనేవి క్రీడల ద్వారా అలవడే గొప్ప లక్షణాలని ఆయన ఉద్ఘాటించారు.
జార్జి క్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడలను తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు మహేశ్వరరావు గారు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణమండలి సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ సాధారణంగా ఎవరైనా తమకు ప్రియమైన వారి జ్ఞాపకార్థం అన్నదానాలు లేదా పూజలు చేస్తుంటారు. కానీ, సమాజానికి ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. పోటీల నిర్వహకులు, సబాధ్యక్షులు దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ యువతలో మరియు క్రీడాభిమానులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయన్నారు. గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమన్నారు. కార్యక్రమంలో వివేకానంద ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కె.విష్ణుమూర్తి, జార్జి క్లబ్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కొల్లి శ్రీనివాస్, మళ్ల చంద్రశేఖర్, చవితిన నర్సింగరావు, దాడి బుజ్జి, దిబ్బ వీధిక్రీడా సంఘం అధ్యక్షులు ఎల్లప్ప గోవింద, నేషనల్ వాలీబాల్ రిఫరీ బీశెట్టి శ్రీనివాసరావు, ఆడారిహరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

