వీ డ్రీమ్స్ న్యూస్

శ్రావణమాస మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

అనకాపల్లి, ఆగస్టు 8:
అనకాపల్లిలోని శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రావణమాస మహోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఏడాది నుండి ఈశాన్య రమాదేవి అమ్మవారికి సామూహిక పంచఫల కుంకుమ పూజలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

శ్రావణమాసంలో ఐదు శుక్రవారాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

  • 14-08-2026 మొదటి శుక్రవారం: దానిమ్మ పండ్లతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే దారిద్ర్య దోషాలు తొలగుతాయని తెలిపారు.
  • 21-08-2026 రెండవ శుక్రవారం: జామ పండ్లతో పూజలు చేస్తే సంతాన సౌభాగ్యం, సంతోషం కలుగుతుందని పేర్కొన్నారు.
  • 28-08-2026 మూడవ శుక్రవారం: ఆపిల్ పండ్లతో పూజలు చేస్తే ఆయుష్షు, అభివృద్ధి చేకూరుతాయని తెలిపారు.
  • 04-09-2026 నాలుగవ శుక్రవారం: కమలా పండ్లతో పూజలు చేస్తే విద్యాభివృద్ధి, వివాహ యోగం కలుగుతుందని తెలిపారు.
  • 11-09-2026 ఐదవ శుక్రవారం: ద్రాక్ష పండ్లతో పూజలు చేస్తే ధనధాన్య సంపదలు పెరుగుతాయని వివరించారు.

ఈ ఐదు వారాల పంచఫల కుంకుమ పూజలు పూర్తిచేసిన భక్తులకు మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రక్ష అందజేయనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచఫల కుంకుమ పూజలు కొనసాగుతాయని చెప్పారు.

అలాగే ఈ ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పవిత్రమైన శ్రావణమాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈశాన్య రమాదేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కొణతాల రామకృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు సూరిశెట్టి మల్లమ్మ, దొడ్డి భరత్, కర్రీ లక్ష్మీ నూకరాజు, రేబాక వరలక్ష్మి, ఈశ్వర అప్పారావు, తమ్మిరాజు మల్లికార్జునరావు, మారిశెట్టి అరుణ, భాస్కరరావు, తురకలపూడి ఈశ్వరరావు, కైచర్ల నరసయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *