వీ డ్రీమ్స్ అనకాపల్లి
జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ క్లినిక్స్‌పై చర్యలు తీసుకుంటామని డి.ఎం&హెచ్.ఓ ఎం.హైమావతి పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, క్లినిక్స్‌లో నిబంధనల అమలును పరిశీలించేందుకు అక్టోబర్ 21వ తేదీన డీఎం&హెచ్ఓ బృందం అడ్డురొడ్డు జంక్షన్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని తెలిపారు. జ్యోతి డయాగ్నస్టిక్ సెంటర్, దేవి క్లినిక్ మరియు వెంకటేశ్వర పోలీక్లినిక్‌లలో పలు కీలక నిబంధనలు పాటించకపోవడం గుర్తించబడినట్లు డి.ఎం&హెచ్.ఓ ఎం.హైమావతి తెలిపారు.
జ్యోతి డయాగ్నస్టిక్ సెంటర్‌లో సేవల రుసుముల పట్టిక ప్రదర్శించకపోవడం, ఎక్స్‌రే యూనిట్‌కు శిక్షణ పొందిన టెక్నీషియన్ లేకపోవడం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ఒప్పందం గడువు ముగిసినా పునరుద్ధరించకపోవడం, టెక్నీషియన్ లేకుండా ECG మెషీన్ నడిపించడం, పోస్టు గ్రాజ్యుయేట్ వైద్యుడి రిజిస్ట్రేషన్ ప్రదర్శించకపోవడం వంటి ఉల్లంఘనలు నమోదయ్యాయని తెలిపారు. దేవి క్లినిక్‌లో కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి పత్రం లేకపోవడం, ECG టెక్నీషియన్ లేకపోవడం, రుసుముల పట్టిక ప్రదర్శించకపోవడం గుర్తించగా, వెంకటేశ్వర పోలీక్లినిక్‌లో కూడా PCB అనుమతులు మరియు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికేట్ లేవని అధికారులు గుర్తించారు.
ఈ మూడు సంస్థలకు అక్టోబర్ 22న నోటీసులు జారీ చేయగా, నిర్ణీత గడువులో వెంకటేశ్వర పోలీక్లినిక్ మాత్రమే వివరణ సమర్పించిందని అన్నారు. తదనంతరం, నవంబర్ 11న రెండో నోటీసు జారీ చేయగా జ్యోతి డయాగ్నస్టిక్ సెంటర్, దేవి క్లినిక్‌లు నవంబర్ 20న సమాధానాలు అందజేశాయని,
సమాధానాలను పరిశీలించిన అనంతరం నవంబర్ 27న మళ్లీ నిర్వహించిన తనిఖీలో జ్యోతి డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉల్లంఘనలు కొనసాగుతున్నట్టు గుర్తించడంతో ఆ కేంద్రాన్ని సీజ్ చేసి మూడు నెలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డి.ఎం&హెచ్.ఓ ఎం.హైమావతి తెలిపారు. దేవి క్లినిక్‌ను సందర్శించినప్పుడు ఆ క్లినిక్ మూసి ఉన్నట్లు గమనించబడిందని తెలిపారు. జిల్లాలో ప్రజారోగ్య భద్రతకు విఘాతం కలిగించే ఏ ప్రైవేట్ వైద్య సంస్థనైనా ఉపేక్షించబోమని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని డి.ఎం&హెచ్.ఓ ఎం.హైమావతి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO, ల్యాబ్ టెక్నీషియన్లు, రాయవరం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


