తాడి గ్రామ పునరావాసానికి కీలక అడుగు
పెద ముషిడివాడలో ఆర్ & ఆర్ కాలనీ ఏర్పాటుపై సమీక్ష
వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కాలుష్య ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారవాడ మండలం తాడి గ్రామ ప్రజల దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది.
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు మరియు తాడి గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాడి గ్రామాన్ని పునరావాసం (R&R) కింద పెద ముషిడివాడ గ్రామానికి తరలించడం, అక్కడ అన్ని మౌలిక సదుపాయాలతో ఆర్ & ఆర్ కాలనీ అభివృద్ధి చేయడంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా తాడి గ్రామ ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపాదిత ఆర్ & ఆర్ కాలనీ కోసం పెద ముషిడివాడలో 56 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
సంబంధిత నిబంధనల ప్రకారం ఒక వారంలోపు ఆర్ & ఆర్ కాలనీ లేఅవుట్‌ను సిద్ధం చేసి సమర్పించాలని పారవాడ తహసీల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అలాగే 2016లో గుర్తించిన ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ (PDFs) సంఖ్య, ప్రస్తుతం ఉన్న అర్హుల వివరాలపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ఈ సమావేశం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌరిమాన్ పటేల్, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ (DZM), గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు, పారవాడ తహసీల్దార్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

