వీ డ్రీమ్స్ అనకాపల్లి
అస్సాం రాష్ట్రంలో వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సహాయం అందించేందుకు అనకాపల్లి జిల్లా నుంచి విరాళాల సేకరణ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షల విరాళాలు సేకరించామని, మొత్తం రూ.10 లక్షలు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో హెల్త్, హయ్యర్ ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఐసీడీఎస్ శాఖలతో పాటు ప్రైవేట్ కళాశాలలు కూడా విరాళాల సేకరణలో పాల్గొంటున్నాయని కలెక్టర్ తెలిపారు. విద్యుత్, విద్యాశాఖల్లో పనిచేస్తున్న సుమారు 4 వేల మంది ఉద్యోగులకు ఈ కార్యక్రమం సమాచారం చేరితే లక్ష్యం సులభంగా పూర్తవుతుందని పేర్కొన్నారు.
అన్ని కార్యాలయాల నుంచి ఉద్యోగులకు విరాళాల సమాచారం చేరవేసి, ఈరోజు మరియు రేపు సాయంత్రంలోపు నిధుల సేకరణ పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన విరాళాలను చెక్కు రూపంలో అస్సాంలోని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌కు నేరుగా పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక వస్తువులను రవాణా చేయడానికి సమయం పడుతుందని, నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే అక్కడి అధికారులు అవసరమైన వాటర్ ఫిల్టర్లు, దుప్పట్లు, శానిటరీ ప్యాడ్లు, టార్పాలిన్ షీట్లు, వంట సామగ్రి వంటి వస్తువులను త్వరగా కొనుగోలు చేసి బాధితులకు అందించగలరని కలెక్టర్ వివరించారు.
అనకాపల్లి జిల్లా ఉద్యోగులు, ప్రజలు తమవంతు సహాయం అందించి ఈ మానవతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, సీపీఓతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

