రీ-సర్వే ప్రభావంతో రైతుల ఆందోళన

భూముల రికార్డులు, హద్దుల సమస్యలతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రీ-సర్వే ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. భూముల విస్తీర్ణం, హద్దులు, రెవెన్యూ రికార్డుల్లో తేడాలు రావడంతో దాదాపు 90 శాతం మంది రైతులు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎంఆర్‌ఓ కార్యాలయాలు, సర్వేయర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
రీ-సర్వేలో చోటుచేసుకున్న తప్పుల కంటే, వాటిని సరిచేసే ప్రక్రియలో కొంతమంది రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది చూపుతున్న నిర్లక్ష్యం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు సరైన సమాచారం అందించకుండా, సమస్య పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు చూపించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు.
రీ-సర్వే వంటి కీలకమైన కార్యక్రమం ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలంటే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ప్రతి గ్రామంలో రీ-సర్వేలో వచ్చిన లోపాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ పత్రాలు, అడంగల్, పాత రెవెన్యూ రికార్డులను ఆధారంగా తీసుకుని సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన రీ-సర్వే కార్యక్రమం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారకముందే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
