రిసర్వే పనులను వేగవంతం చేయాలి

సర్వే శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.ఎస్.ఎన్. కుమార్

వీ డ్రీమ్స్ అనకాపల్లి

రిసర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని సర్వే శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.ఎస్.ఎన్. కుమార్ సూచించారు.

ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత త్వరితగతిన, పారదర్శకంగా అందించేందుకు రెవెన్యూ, సర్వే అధికారులకు మంగళవారం మధ్యాహ్నం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ సర్వే శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సి.హెచ్.వి.ఎస్.ఎన్. కుమార్ మండల సర్వేయర్లు, రిసర్వే డీటీలకు రెవెన్యూ సేవలకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ప్రజల నుంచి అందే దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా సకాలంలో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రెవెన్యూ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

రెవెన్యూ సేవలకు సంబంధించిన సాంకేతిక అంశాలు, నూతన విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై అధికారులకు వివరించారు. ప్రజల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, నిబంధనల పరిధిలో వేగంగా పరిష్కారం చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సర్వే ఏడీ గోపాల్ రాజా, ఇన్‌స్పెక్టర్ బి.ఎన్.ఎస్. ప్రసాద్, డీఐఓఎస్‌లు, మండల సర్వేయర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *