వీ డ్రీమ్స్ – అమరావతి

మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

సెప్టెంబర్ 3న వార్డు వారీ ఫొటో ఓటరు జాబితాల ప్రచురణ

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు వార్డు వారీ ఫొటో ఓటరు జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీతా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డు వారీ ఫొటో ఓటరు జాబితాలను 03-09-2026న ప్రచురించనున్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటరు జాబితాల తయారీతో పాటు, మేయర్ పదవులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ఖరారుకు వీలుగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ZA, మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలు, సంబంధిత ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

వార్డు వారీ ఫొటో ఓటరు జాబితాలను సిద్ధం చేసి ప్రచురించే బాధ్యతను రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లకు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో సంబంధిత జోనల్ కమిషనర్లకు అప్పగించారు.

2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి, అప్పటి వరకు ప్రచురించిన అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వార్డు వారీ ఓటరు జాబితాలను రూపొందించాలని ఆదేశించారు.

వార్డు వారీ ఫొటో ఓటరు జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి ఎన్నికల సంఘం త్వరలో మార్గదర్శకాలు, విధివిధానాలను జారీ చేయనుంది.

ఈ నోటిఫికేషన్ ప్రతులను రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *