వీ డ్రీమ్స్ – అనకాపల్లి
అమెరికా నుంచి అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా దిగుమతి అయిన మలసాల భరత్ కు ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ శ్రేణుల సహకారం అంతంత మాత్రంగా ఉండడం, నియోజకవర్గం సమస్యలపై అవగాహన లేకపోవడంతో ప్రజలు భరత్ పట్ల విముఖత చూపుతున్నారు. అలాగే భరత్ తండ్రి మలసాల రమణారావు ఆర్ఈసీఎస్ ఛైర్మన్ గా ఉన్నపుడు భరత్ తల్లి ధనమ్మ సాగించిన అవినీతి దందా ఇపుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు దండుకుని యువత ను మోసం చేసారనే ఆరోపణలు ఇపుడు తెరపైకి వచ్చాయి. అలాగే ఆర్ఈసీఎస్ ఛైర్మన్ హోదాలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని తండ్రి పై ఆరోపణలు మరోవైపు ఉండనే ఉన్నాయి. ఎడా పెడా పార్టీలు మార్చి స్వప్రయోజనాలు చూసుకునే ఈ కుటుంబం పట్ల సొంత మండలం అయిన కశింకోటలోనే సదభిప్రాయం లేదు. పోనీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గం కొమ్ము కాస్తుందనే నమ్మకం లేదు. కాపులలో మెజారిటీ శాతం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. పోనీ పార్టీ శ్రేణులు అండగా ఉంటారనుకుంటే చాలామంది నాయకులు గాజువాక వెళ్లి అమర్ విజయానికి పని చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో శ్రీమంతుడిని అని చెప్పుకునే భరత్ డబ్బు వెదజల్లి ఓట్లు కొనుక్కోవాల్సిందే తప్ప ప్రజాభిమానం గెలిపిస్తుందని ఆశ పడడం అత్యాశే అవుతుంది.