వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశంమందిరంలో రైతు సాధికార సంస్థ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్దిశాఖల అధికారులతో 2025 ఖరీఫ్ సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం లక్ష్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు అభివృద్ది చేయుటకు రానున్న రెండు నెలలలో చేయవలసిన పనులపై ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయుటకు కావలసిన వనరులు గల గ్రామాలను ముందుగా గుర్తించాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి వనరుగా అవసరమైన గోసంపదకు సంబంధించిన సమాచారం పశుసంవర్థకశాఖ వారి నుండి తీసుకోవాలని తెలిపారు. ముందుగా గ్రామస్థాయి, మండల స్థాయిలలో కనీసం మూడు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని గుర్తించి నూరు శాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభించుటకు ముందే సిబ్బంది అందరూ క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మారే విధంగా ప్రోత్సాహించాలని, రైతులు సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని, వాటి వినియోగంపై విస్త్రతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ ప్రాంతాలలో రసాయన ఎరువులు వాడకం చాలా తక్కువని అధికారులకు సూచించారు. రానున్న 15 రోజులలో పూర్తిస్థాయి నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. ఇతర గ్రామాలలో రసాయన ఎరువుల వినియోగ, విక్రయాలు కనిష్టస్థాయికి తీసుకురావాలని, తద్వారా ప్రకృతి వ్యవసాయానికి రైతులు మారే విధంగా చూడాలని తెలిపారు. రైతు సాధికార సంస్థ, వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్దిశాఖలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.మోహనరావు, రైతు సాధికార సంస్థ జిల్లా ప్రోజెక్టు మేనేజరు సిహెచ్. లచ్చన్న, మండల వ్యవసాయ అదికారులు, డి.ఆర్.డి.ఎ. ఎపిఎమ్ లు తదితరులు హాజరయ్యారు.
