వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రభుత్వం పేదలకు కల్పిస్తున్న ఇంటిస్థలాల క్రమబద్దీకరణ పధకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేయాలని జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో తహశీల్దార్లు, మండల కేంద్ర డిప్యూటీ తహశీల్దార్లతో పి.జి.ఆర్.ఎస్., రీసర్వే, అర్జీల పరిష్కారం, గ్రామసభలు, వెబ్ ల్యాండు, ఇళ్ల స్థలాల రీ-వెరిఫికేషను, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, రికార్డు రూంల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్, జాయింటు కలెక్టరు ఎమ్.జాహ్నవి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వారీగా తహశీల్దార్లు, మండల కేంద్ర డిప్యూటీ తహశీల్దార్లను వారు నిర్వహిస్తున్న విధులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ మాట్లాడుతూ కార్యాలయంనకు వచ్చే ధరఖాస్తులు, అర్జీలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అధికారులు ప్రజల నుండి పిర్యాదులు రాకుండా పనిచేయాలని, మెరుగైన సేవలు సకాలంలో అందించాలని, మండల కార్యాలయాల నిర్వహణలో డిప్యూటీ తహశీల్దారులది కీలకభాద్యతఅని, వారు బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో పేదలు నిర్మించుకున్న స్థలాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన పధకం గూర్చి ప్రజలకు తెలియజేయాలని, విస్త్రత ప్రచారం కల్పించాలని, అర్హులైన వారందరూ ఈ పధకానికి ధరఖాస్తుచేసుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో తేది.15.10.2019 నాటికి ఇళ్లు కట్టుకొని, ప్రస్తుతం నివాసముంటూ, ఇంటికి సంబంధించిన ఆధార పత్రాలు కలిగి, ఎక్కడా ఇళ్లు లేని వారు మాత్రమే ఈ పధకానికి అర్హులని తెలిపారు. 150గజాల లోపు స్థలంలో ఇళ్లు కట్టుకున్న పేదవారికి ఉచితంగా గాను, అంతకంటే ఎక్కువ స్థలం కలిగిన వారికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రుసుము వసూలు చేసి క్రమబద్దీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను నిబంధనల మేరకు అర్హులైన లబ్దిదారులకు మాత్రమే అందించాలని, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలపై ప్రజలనుండి ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నదని, దానిద్వారా పిర్యాదులు వస్తే విచారణ అనంతరం సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జాయింటు కలెక్టరు ఎమ్. జాహ్నవి మాట్లాడుతూ రీ-సర్వే, గ్రామసభలలో వచ్చిన అర్జీలనన్నింటిని రెండు రోజులలో పరిష్కారం చేయాలని తెలిపారు. వెబ్ లాండులో మార్పులు కోసం వచ్చే ప్రతిపాదనలు సర్వేనంబరు, సబ్ డివిజను పూర్తి వివరాలతో పంపించాలన్నారు. వివాదాస్పద భూములు వివరాలు నమోదుచేయునపుడు మొత్తం సర్వేనంబరు కాకుండా సంబంధిత భాగం వివరాలు మాత్రమే నమోదుచేయాలన్నారు. ఇండ్ల స్థలాల రీ-వెరిఫికేషను, షెడ్యూలు కులాలవారికి పరిహారం చెల్లింపు, కోర్టు కేసులకు సంబందించి కౌంటర్లు దాఖలు చేయడం సంబంధిత పనులు వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. వ్యవసాయేతర భూవినియోగం గుర్తించి నాలా పన్నులు వసూలుచేయాలని తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించి చౌకధరలదుకాణాలు, గొడౌన్లు, బియ్యం మిల్లులను తనిఖీచేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదుచేయాలని తెలిపారు. పత్రికలలో వచ్చిన వ్యతిరేకవార్తలపై వెంటనే చర్యలు తీసుకొని, నివేదికలను అందజేయాలని జాయింటు కలెక్టరు తెలిపారు. రికార్డురూం లను సక్రమంగా నిర్వహించాలని, భద్రతకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో పేదలు నిర్మించుకున్న స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి పూర్తి వివరాలకు, సందేహాల నివృత్తికై వారి మండల తహశీల్దారు కార్యాలయంలో ప్రజలు సంప్రదించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కె.కె.ఆర్.సి. స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస. సుబ్బలక్ష్మి, బి.జె.ఆర్.యు.ఎస్.ఎస్. స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.రమామణి, రెవిన్యూ డివిజినల్ అధికారులు వి.వి.రమణ, షేక్ ఆయిషా, కలెక్టరుకార్యాలయ పరిపాలనాధికారి బి.వి.రాణి, సెక్షను సూపరింటెండ్ంట్ లు, సర్వేశాఖ సహాయ సంచాలకులు గోపాలరాజ, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు.
