వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి పట్టణం,
ప్రసూతి శస్త్రచికిత్సలు చేయడానికి గర్భిణుల కుటుంబాల నుంచి లంచం వసూలు చేస్తున్న వైద్యురాలిపై సస్పెన్షన్ వేటుపడింది. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో గైనిక్ సివిల్‌సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ శోభాదేవి శస్త్రచికిత్సలు చేయడానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని కలెక్టర్ విజయకృష్ణన్‌కి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గతనెల 25న కలెక్టర్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులో బాలింతలతో మాట్లాడి వైద్యసేవలు ఎలా అందుతున్నాయో అడిగితెలుసుకున్నారు. శస్త్రచికిత్సలు చేయడానికి డబ్బులు ఎవరైనా అడిగారా అని వార్డులో అందరినీ అడిగారు. వీరంతా సేవలు బాగానే అందుతున్నాయని సమాధానం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు తమవద్ద శస్త్రచికిత్సకు డబ్బులు తీసుకున్నారని వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ సంబంధిత వైద్యురాలు శోభాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు శోభాదేవిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
