పది కోట్ల రూపాయలతో శ్రీ నూకాంబిక అమ్మ వారి ఆలయ నిర్మాణం అభివృద్ది పనులు :జిల్లా ఇంచార్జి మంత్రి  కొల్లు రవీంద్ర

వీ డ్రీమ్స్ అనకాపల్లి

అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు, భూగర్బ, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాలు పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణగారి కృషి ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న వార్షిక జాతర మహోత్సవాలకు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టమన్నారు. దేవాలయాన్ని సుమారు పదికోట్ల రూపాయలు నిధులతో నిర్మాణం, అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ది పనులు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేవాలయం అభివృద్ది పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు మూలంగా భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వస్తారని, అనకాపల్లి పర్యాటకంగా కూడా అభివృద్ది చెందుతుందని తెలియజేసారు. దేవాలయం అభివృద్దికి ప్రభుత్వం తరపు నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, అర్బన్ పైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కార్పొరేషను చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఎ.పి.గవర సంక్షేమ మరియు అభివృద్ది కార్పొరేషను చైర్మన్ మల్ల సురేంద్ర, కొప్పులవెలమ సంక్షేమ, అభివృద్ది కార్పొరేషను చైర్మన్ పి.వి.జి. కుమార్, ఆలయ చైర్మన్ పీలా నాగశీను, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

నూకాంబికా దేవాలయం లో విలేకరుల తో మాట్లాడుతున్న జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపి సిఎం రమేష్, దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *