వీ డ్రీమ్స్ అనకాపల్లి
అనకాపల్లి జిల్లాలో గడచిన ఆరు నెలలుగా పూర్తి స్థాయి జాయింట్ కలెక్టర్ (జేసీ) లేకపోవడంతో జిల్లా పరిపాలన పూర్తిగా కుంటుపడిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నియమించాలని ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రచారకులు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజా పరిస్థితులను వివరిస్తూ ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి శనివారం ‘ఎక్స్’ వేదికగా పంపిన వినతిపత్రాన్ని ఆయన మీడియాకు వివరించారు. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటంతో వివిధ పనుల కోసం కార్యాలయంకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా ‘అనకాపల్లి ఉత్సవ్ ’ వంటి వరుస ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లతో జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో, సామాన్యుల ఫైళ్లు పెండింగ్లో పడిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎస్`ఎ) డిపార్ట్మెంట్ ఉత్తర్వు (జీవో ఆర్టీ నెం. 63 తేది : 12-1-2026)ను అనుసరించి కొత్త జేసీ నియామకం జరిగినప్పటికీ, ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
చతికలపడ్డ కీలక విభాగాలు
జేసీ లేకపోవడం వల్ల జిల్లాలో భూ వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూ రికార్డుల కంప్యూటరీకరణ అటకెక్కాయన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, రోడ్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, భూముల రీ సర్వే, ఏపీఐఐసీ భూసేకరణ, సబ్సిడీ బియ్యం పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ సమన్వయం లోపించిందన్నారు. పింఛన్లు, గృహ నిర్మాణ పథకాల పురోగతిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువైందన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల పనితీరు, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యేలు చొరవ చూపాలి
జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా యుద్ధప్రాతిపదికన జాయింట్ కలెక్టర్ నియామకం కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాండ్రేగుల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.

