ఒక గ్రామం.. వంద ప్రజాసమస్యలు…..  సున్నా పరిష్కారం!!

( వీ డ్రీమ్స్ ప్రత్యేకం )

ప్రజా సమస్యల పరిష్కార వేదికలు, రీ సర్వే రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్లు… ఒక నెల… ఒక గ్రామం…4 సందర్శనలు.
ఈ కార్యక్రమాలన్నీ సమస్య ల పై అర్జీలు తీసుకునేవే తప్ప రైతులసమస్యలు తీర్చేందుకు వీలుగా రూపొందించినవేనా?? అంటే కావని వాస్తవ పరిస్థితులే
స్పష్టం చేస్తున్నాయి.
ఈ కార్యక్రమాలన్నీ మొక్కుబడి కార్యక్రమాలేనన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిదా ? అంటే తెలుసుననే చెప్పాలి.
రైతుల భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలంటే రెవిన్యూ అధికారులకు రైతులు లంచాలు (దీనినే ముద్దుగా ఫార్మాలిటీస్ అని అంటారు) సమర్పించుకోవాల్సిందే. లేదంటే ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరెగేలా తిరగాల్సిందే.

ప్రజా సమస్యల పరిష్కార వేదికతో రెవెన్యూ పనులు జరగడం లేదన్న విషయాన్ని ప్రజల ఫిర్యాదుల వలనే తెలుసుకున్న ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసింది. అవి దండగ మారి గా ఉన్నాయని భావించి ఇప్పుడు ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు తో ఆ గ్రామ సమస్యలను అధికారులు పరిష్కరించాలంటూ నిర్దేశించింది.

ఒక గ్రామం.. ఒక నెల…. నాలుగు సందర్శనలు పేరిట ఏర్పడిన ఈ కార్యక్రమం ను మొదట ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ నిర్వహించారు అక్కడ ఈ కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేశారు. దీంతో ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఈ పథకాన్ని అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకున్నట్టు లేదు నాలుగైదు మండలాల్లో అక్కడ తాసిల్దారులు శ్రద్ధ తీసుకొని అమలు చేస్తున్నారు తప్ప చాలా చోట్ల ప్రతి గురువారం జరిగే ఈ కార్యక్రమం కూడా మొక్కుబడి తంతు గా తయారవుతున్నది.

జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఈ పథకం ప్రారంభమైందో వివరాలు ప్రముఖంగా ప్రకటించలేదు. నాలుగు వారాల్లో రెండు వారాలు గడిచిపోయాయి మొదటివారం ప్రసంగాలకు, ఫిర్యాదుల స్వీకరణకు పరిమితం కాగా రెండో వారం గందరగోళంగా ముగిసింది. రెండు వారాల ప్రగతిని ఏ ఒక్క అధికారి సమీక్షించినట్టు కనిపించడం లేదు. కేవలం రెవెన్యూ లేదా భూ సంబంధిత సమస్యలకే పరిమితం కావాల్సిన ఈ పథకం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లా అంటే అన్ని శాఖలకు చెందిన అర్జీలు సేకరించే కార్యక్రమం లా భాష్యం చెప్తున్నారు. పోనీ మొదటిగా ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కంప్లైంట్ లకే ప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తారా అంటే అదీ లేదు. రీ సర్వే, పట్టాదారు పుస్తకాలు , మ్యుటేషన్ ,రికార్డులో తప్పుల సవరణ వంటి ఫిర్యాదులను ,పొలం గట్ల గొడవలను తాసిల్దారులు ఇందులో భాగం చేస్తున్నారు. గ్రామ నాయకులు పొలంగట్ల గొడవలను తాసిల్దార్ల ముందు పెట్టి వాటిని పరిష్కరించమని గొడవ పెడుతున్నారు అసలే ఎండాకాలం మండుతున్న ఎండల్లో ఈ పథకం ఒక ప్రహసనంగా తయారయింది. ప్రజా సమస్య పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లు, ఒక నెల…. నాలుగు సందర్శనలు ఇలా ఈ కార్యక్రమాలన్నీ మంచివే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో జిల్లాలో ఆర్డీవోలు డిప్యూటీ కలెక్టర్లు, సర్వే జిల్లా అధికారికి గ్రామాలు కేటాయించి ఆ గ్రామాల్లో వారు సందర్శనలు జరిపి సమస్యలు పరిష్కరించాలని నిర్దేశించారు . కానీ జిల్లాలో ఎంతమంది ఆర్డీవోలు డిప్యూటీ కలెక్టర్లు సర్వే అధికారులు ఆ గ్రామాలకు వెళ్తున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఒక కార్యక్రమం ప్రారంభించి దాని మంచి చెడ్డలు గమనించి పట్టుదలతో దానిని విజయవంతం చేయడం అనే దే ఉండదు. ఒకదాని వెనక ఒకటి కొత్త కొత్త కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రకటిస్తూ పోతుంటారు అధికారులు అన్నిటిని తేలిగ్గా తీసుకొని దులిపేసుకుని పోతుంటారు.
గ్రామాన్ని రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దే ఆశయం ఆశయంగానే మిగులుతోంది. అనేకసార్లు ఈ గడువును పెంచుతూ పోతున్నారు మార్చి 27 నాటికి అన్ని గ్రామాలను రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా మార్చేస్తామని ముఖ్యమంత్రి మరొకసారి ఈ గడువును పెంచారు.
లంచాలు ఇవ్వని దే పనులు చేయమని అధికారులు మొండికేస్తున్నారు. ప్రభుత్వ గడువు పెంచడం లంచాల సంపాదనకు మరింత అవకాశం ఇస్తున్నాయి. లంచాల సొమ్ము అధికారులకు ఉద్యోగులకు బాగా చేరుతోంది. చెడ్డపేరు ప్రభుత్వానికి వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ కార్యక్రమాల అమలు పై కచ్చితంగా దృష్టి పెట్టకపోతే నష్టపోయేది అధికార పార్టీయే.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఘోరంగా విఫలమవుతున్న దీ ఈభూకబ్జాలకు అడ్డు ఆపు లేని జిల్లాగా పేరు తెచ్చుకుంటున్నదీ అనకాపల్లి జిల్లా వే.
ప్రజా దర్బార్లు పెట్టి అధికార పక్ష నాయకులు వినతుల స్వీకరిస్తున్నారు అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. కానీ వాటి గతి ఏమైందో నాయకులు పట్టించుకోరు రాష్ట్ర స్థాయి అధికారులు అంతకన్నా
పట్టించుకోరు . ఒక గ్రామం ఒక నెల నాలుగు సందర్శనల కార్యక్రమాన్ని ఏ ఒక్క జిల్లా స్థాయి అధికారైన సందర్శించి అక్కడ ఒక గంట కూర్చున్న దాఖలా ఎక్కడా కనిపించడం లేదు. రెవిన్యూ డివిజనల్ అధికారులు పనితీరు మరింత ఘోరంగా ఉందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.అధోగతి గా తయారవుతున్నది ఈ జిల్లా నాయకుల అధికారుల పని తీరు.

జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా సంక్షేమ కార్యక్రమాల్లో బాగానే ఉన్నా రైతాంగ సమస్యలు చక్కదిద్దకపోతే ముప్పు తప్పదు.

కసింకోట మండలంలో నిర్వహించిన ఒక గ్రామం ఒక నెల నాలుగు రోజులు ప్రజా పరిష్కార వేదికలో (ఫైల్ ఫొటో )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *