కాలుష్య కోరల్లో తాడి గ్రామం : జనవిజ్ణాన వేదిక

వీ డ్రీమ్స్ పరవాడ పరవాడ మండలం తాడి గ్రామం చుట్టూ గల ఫార్మా పరిశ్రమల మూలంగా విడుదలయ్యే కాలుష్యంవల్ల గాలి, నీరు, భూమి కలుషితం కావడం వల్ల అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని జనవిజ్ఞాన వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవిజ్ఞాన వేదిక ఉత్తరాంధ్ర జిల్లాలలో చేపట్టిన పర్యావరణ అవగాహన యాత్రలో భాగంగా ఈరోజు పరవాడ మండలం లోని పెదతాడి, చినతాడి,తాడి కాలనీ, తానాం గ్రామాలను జె.వి.వి అనకాపల్లి జిల్లా బృందం సందర్శించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. తాడి గ్రామంలోని మహిళలు తమ గోడును విన్నవించుకుంటూ విపరీత వాయు, జల, భూ కాలుష్యాలు భయం కొలిపే విధంగా ఉన్నాయని తెలిపారు. వారి మాటల్లో చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు గర్భస్రావం భయంతో ఊర్ల లో ఉండటం లేదని చిన్నపిల్లలకైతే శాసకోస వ్యాధులు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని, వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లలో దిగి పని చేయడం వలన పుండ్లు, చర్మవ్యాధులు వస్తున్నాయని మరియు ముడుకుల నొప్పుల బాధలు కూడా కలుగుతున్నాయని ఆవేదన వెలుబుచ్చారు. గేదెలు వంటి జీవాలకు పునరుత్పత్తి జరగడం లేదని, వ్యవసాయ పంటలు వేయడం పూర్తిగా మానేశామని అక్కడ ప్రజానీకం తెలిపారు. పండగ నిమిత్తం వచ్చిన ఆడబిడ్డలు కాలుష్యం వలన ఉండడానికి ఇబ్బంది పడుతూ తిరిగివెంటనే వెనక్కు వెళ్లిపోవాలని ఉన్నట్లు తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ మూడు గ్రామాల్లోని ఏ ఒక్కరిని కదిపినా ఇదే విధమైన భయాందోళన లను వెలుబుచ్చుతూ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ జీవిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం అన్యాయమని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రజల జీవన పరిస్థితుల మెరుగుదలకు కాలుష్య నివారణ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డిమాండ్ చేశారు. కె.త్రిమూర్తులు రెడ్డి గారి నాయకత్వన శ్రీ మారిశెట్టి వెంకట అప్పారావు, బి రామ్ కుమార్, మరియు బి ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *