వీ డ్రీమ్స్ అనకాపల్లి
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని నిర్మించడంలో మహాశయుడు వి.ఐ లెనిన్ శత వర్థంతి సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి రామునాయుడు భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంటా శ్రీరామ్ అధ్యక్షతన సభ జరిగింది. ముందుగా లెనిన్ చిత్ర పటాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కె.లోకనాధం మాట్లాడుతూ మార్క్సిజాన్ని మానవాళి విముక్తి కోసం ఉపయోగించిన మహోపాధ్యయుడు కామ్రేడ్ వి. ఐ. లెనిన్ అని అన్నారు. లెనిన్ 1870 ఏప్రిల్ 22 జన్మించి, 1924 జనవరి 21 న మరణించారు. కేవలం 54 సంవత్సరాలు మాత్రమే జీవించి, ప్రపంచ పీడిత ప్రజల జీవితాల బాగు కోసం పోరాడిన మహనేత అని కొనియాడారు. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, దారిద్య్రం లేని సోషలిస్టు వ్యవస్థ సాధన కోసం కృషి చేసి సాధించిన గొప్ప ఆచరణ వాదని అన్నారు. 1917 లో రష్యా లో సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేసి, ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవాలు జయప్రదం కావటానికి బాటలు వేసిన చిరస్మరణీయుడని, అమానుషమైన పెట్టుబడిదారీ దోపిడీకి విరుగుడు సోషలిజమేనని ఆయన ఆచరణలో రుజువు చేశారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ దశలో ప్రజల సంపద కార్పొరేట్ పాలవుతున్న కాలంలో లెనిన్ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. సామాజిక అణిచివేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆనాటి సామాజిక ఉద్యమాలని ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు. ఇంత దూర దృష్టి కలిగిన మహా నాయకుడు శత వర్ధంతిని జరుపుకోవడం మన అందరి బాధ్యత. యువత బంగారు భవిష్యత్తుకు దారీ చూపే భారతదేశ అభ్యున్నతికి, ప్రపంచానికి లెనిన్ సిద్ధాంతం మార్గదర్శకం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లు రాజు, బి.ఉమామహేశ్వరావు, పెంటకోట శ్రీనువాసరావు, కె.ఈశ్వరావు, జి.సుభాషిణి, నాగిరెడ్డి సత్యన్నారాయణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
