వీ డ్రీమ్స్ కాకినాడ రూరల్
రీ సర్వే తో పాటు సర్వే జరుగుతున్న గ్రామాల్లోని ఇతర రెవెన్యూ సమస్యలను కూడ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఇటీవల నెల రోజులు పాటు జరిగిన రెవెన్యూ సదస్సులలో రైతులు అందజేసిన అర్జీలను పరిష్కరించి సమస్యల బారి నుండి వారికి విముక్తి కలిగించాలని తన ఆదేశాలలో పేర్కొన్నారు. రీ సర్వే జరిగిన గ్రామాలలో విఆర్వోలు,సర్వేయర్ లు,ఇతర అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉంటారు. కనుక సమస్యల పరిష్కారం సులభమౌతుంది.భూమికి సంబంధించి సమస్యలు అధికం.సర్వే పై ఆధారపడినవి కనుక ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.
అయితే ఈ అవకాశం రెవెన్యూ సర్వే జరుగుతున్న గ్రామాలకే పరిమితం. మిగతా గ్రామాలలో సమస్యలు పరిష్కారం ఎప్పుడని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.అర్జీ లను 45 రోజులు లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రారంభంలో ప్రకటించింది. గడువు దాటి పోతున్న వాటి పరిష్కారానికి ఒక ప్రణాళిక అంటు లేకపోయింది. అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలోనే అర్జీలు అందాయి.వీటిలో అధిక భాగం పరిష్కారం అయినట్లు రెవెన్యూ అధికారులు కాకి లెక్కలు చెప్తున్నారు. మెప్పు కోసం చేసే ప్రకటనలే తప్ప ఇందులో వాస్తవం లేనే లేదని రైతు నాయకులు విమర్షిస్తున్నారు.
రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీ లు ఎన్ని పరిష్కారం అయ్యాయి? అసలు సమస్యలు నిజంగా పరిష్కారం అయ్యాయా లేదా అని అడిగే నాధుడు,సమీక్ష జరిపే పద్దతి లేనందున రెవెన్యూ అధికారులు ఆడిందే ఆటగా తయారైందన విమర్షలు వస్తున్నాయి. ఆర్డీఒ,జాయింట్ కలెక్టర్,కలెక్టర్లు పరిష్కారం అయినట్లు చెప్తున్న సమస్యలపై పరిశీలన జరిపితే నిజా నిజాలు బయట పడతాయని రైతు సంఘాలు అంటున్నాయి.రెవెన్యూ సదస్సుల సందర్భంగా అక్కడికక్కడే పరిష్కారమైన సమస్యల జాబితాను ఆన్ లైన్ లో ఉంచాలని గ్రామ సచివాలయాల నోటీసు బోర్డులో ఈ జాబితాలను పెట్టాలని కాకినాడ రూరల్ జిల్లా రైతు సంఘాల నాయకులు సూచిస్తున్నారు.
