వీ డ్రీమ్స్ స్టీల్ ప్లాంట్
స్టీల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు మరియు మిత్రపక్షల ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా లో పెద్ద ఎత్తున ప్రభుత్వ యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మికులు నినదించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి యు రామస్వామి మాట్లాడుతూ యాజమాన్యం కావాలని కార్మికులకు జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. 2500 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగిన కనీసం 80 కోట్లతో కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో యాజమాన్యం లేదని ప్రభుత్వ ఆదేశాలతోనే కార్మికులకు జీతాలు చెల్లించడంలో జాప్యం చేస్తుందని ఆయన అన్నారు. కార్మికుల కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితికి తీసుకువచ్చి వారిని మానసికంగా, ఆర్థికంగా అణచివేయాలనే దుర్మార్గపు ఆలోచనలు తక్షణం విరమించుకోవాలని ఆయన వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యాజమాన్యం తీవ్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటిదాస్, మిత్రపక్షాల ప్రతినిధులు డివి రమణారెడ్డి, డి సురేష్ బాబు, సి ఎస్ సన్యాసిరావు మాట్లాడుతూ యాజమాన్యం క్రమశిక్షణ పేరుతో కార్మికులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా కార్మిక హక్కులను కాపాడవలసిన గుర్తింపు యూనియన్ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తుందని వారు తీవ్రంగా విమర్శించారు. యాజమాన్యంతో గుర్తింపు యూనియన్ సమన్వయ లోపం వల్లే నేడు కార్మికులకు జీతాలు అందలేదని వారు వివరించారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న యాజమాన్య వైఖరిని గుర్తింపు సమర్థిస్తోందని, దీనివల్లనే కార్మికుల్లో అసంతృప్తి పెరిగి కర్మాగారంలో ఉత్పత్తి ఉత్పాదకతలపై తీవ్ర పరిణామాలు చూపుతాయని వారు అన్నారు. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని తక్షణం యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించాలని వారి డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, కె ఎం శ్రీనివాస్, పి భానుమూర్తి, శ్రీనివాస్, రమణమూర్తి తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.