వీ డ్రీమ్స్ అనకాపల్లి
ఏప్రిల్ మే నెలల్లో అనకాపల్లి జిల్లా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు వారిని
అభినందించాల్సిందే!. దూరు కామమ్మ సత్రం భూములను తిరిగి దేవాదాయ శాఖ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అనకాపల్లి నడిబొడ్డున ఎన్టీఆర్ మార్కెట్ యార్డు వద్ద గల ఈ భూమిని చడీ చప్పుడు కాకుండా కాజేసేందుకు కోట్లాది రూపాయల డీల్ కుదిరిందని, సాక్షాత్తు రెవెన్యూ శాఖ పెద్ద తలకాయ డైరెక్షన్లో జిల్లా రెవెన్యూ అధికారులు పగడ్బందీగా ప్లాన్ చేశారని వార్తలు గుప్పు మన్నవిషయం జిల్లా వాసులకు గుర్తుండే ఉంటుంది. ఈ వార్త పెద్ద సంచలనమే కలిగించింది. జిల్లా రెవెన్యూ సర్వీసు ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ ను
వెనకేసుకొస్తూ ఉద్యమించారు. నిషేధిత భూముల జాబితాలో లేని
ఎన్టీఆర్ మార్కెట్ యార్డును జాబితాలో చేరుస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారని వారు వాదించారు. రెవెన్యూ రికార్డుల నుంచి కామమ్మ సత్రం భూములు మాయం కావడంపై గట్టి దుమారమే రేగింది. చేసేది లేక రెవెన్యూ వెనక్కి తగ్గిందని పత్రికలు ఘోషించాయి. ఈ భూములనుచడి చప్పుడు లేకుండా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన విషయాన్ని వీడ్రీమ్స్ వెలుగులోకి తెచ్చిన
విషయం తెలిసిందే. కలెక్టర్ ఈ వ్యవహారానికి సంబంధించి జారీ చేసిన ఆదేశాలను నేటికీ ఎందుకు వెనక్కి తీసుకోలేదనే ప్రశ్న
నేటికీ తల ఎత్తుతూనే ఉంది.
ఏదేమైనా కామమ్మ సత్రం భూములు తిరిగి ప్రభుత్వ ఆధీనంలోదేవదాయశాఖ ఆస్తిగా మిగిలాయి అదే సంతోషం !! ఇందుకు జిల్లా కలెక్టర్ ను రెవెన్యూ అధికారులను అభినందించాల్సిందే.
ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని వైసిపి హయాంలో మాదిరి కబ్జాలను ప్రోత్సహించడం లేదని కూటమి నాయకులు పదేపదే చెప్తుంటారు కానీ జిల్లా అధికార పక్ష నాయకులు ఎవరు కామమ్మ సత్రం భూముల విషయంలో నోరెత్తకుండా ఉండిపోవడం ‘పెద్ద తలకాయ’ప్రమేయం ఆరోపణలకు బలం చేకూరింది. ఎన్ననుకున్నా కూటమి ప్రభుత్వం కనుకనే ఈ భూములు తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయని కూడా చెప్పొచ్చు.
వేటు పడింది!!
రోలుగుంట డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లను అనకాపల్లి జిల్లా కలెక్టర్ మే నెల చివర్లో సస్పెండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయక, సంతకాలను ఫోర్జరీ చేసి పేదల సాగులో ఉన్న భూములను బడా బాబులకు కట్టబెట్టి నందుకు వీరిని సస్పెండ్ చేశారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఇక్కడ జరిగిన అవకతవకలను పకడ్బందీగా ఉన్నతాధికారుల ముందుంచింది. దీంతో కలెక్టర్ కఠిన చర్యలను తీసుకున్నారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు ప్రైవేట్ భూముల కబ్జాలను చూసి చూడనట్టు ఊరుకోడమే కాక చేయి తడిపిన వారితో మిలాకతు అయిపోయి రైతులకు అన్యాయం చేస్తున్న రెవిన్యూ ఉద్యోగులకు ఇది ఒక హెచ్చరిక .
రీ సర్వే రికార్డుల నిర్వహణ తదితర అంశాలలో రెవెన్యూ ఉద్యోగులు అక్రమాలకు అవకతవకలకు పాల్పడుతున్నారు. నియమ నిబంధనలు అన్నా,అధికారులు అన్నా భయం లేకుండా తప్పులు చేయడానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధపడుతున్నారు.
ఈ అన్యాయాలపై ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోవడం లేదు .కింది నుంచి పై స్థాయి దాకా లంచాల సొమ్ము అందడ మే ఇందుకు కారణం.
ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్న వార్తలపై తాసిల్దార్లు స్పందించడం లేదు వివరణ అడిగితే అలాగా ..ఇప్పుడే తెలిసింది చర్యలు తీసుకుంటాం అంటున్నారు ఏ గ్రామంలో నైనా ఎలాంటి ఆక్రమణలు అక్రమాలు జరిగితే వెంటనే ఆ విషయం తాసిల్దార్ కు చేర్చే యంత్రాంగం ఉంది.
అయినా తాసిల్దార్లు చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇన్దుకు కారణం లంచాల వ్యవహారమే.
ప్రభుత్వ భూముల కబ్జాలపై ఆక్రమణలపై తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీకి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి సీసీఎల్ఏ కు , అవినీతి నిరోధక శాఖకు అనకాపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్ లు వెళ్తున్నాయి.
రోలుగుంట మండలంలో డిప్యూటీ తాసిల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ల పై కలెక్టర్ తీసుకున్న చర్య ఇప్పుడు ఉద్యోగులకు కాస్త కనువిప్పు కలిగిస్తే మంచిదే.

